blog images

కొడుకు తనకిష్టమైన మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటే "అదేమైనా కూడుపెడుతుందారా శంకరశాస్త్రి! పాటలు నేర్చుకొని బస్టాండ్ ల్లో , రైల్లో అడుక్కు తింటావా ?" అని కొడుకును చిన్నబుచ్చిన తండ్రి!

బాల్యంలో తాను పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని వారు కోరిందే తడవుగా అన్ని కొనిచ్చి గారాబం చేసే కోటీశ్వరుడైన తండ్రి! పరువు, ప్రతిష్ట , స్టేటస్, ముఖ్యమని వీటికోసం ఢాంబికాల్ని ప్రదర్శిస్తూ, నిరాడంబరత, వినమ్రత, సహానుభూతి, శ్రమించే తత్త్వం ఇలాంటి విలువల్ని పిల్లలకు దూరం చేసిన తండ్రి! తనకు ఒక్కడే కొడుకని వాడికి ఎప్పుడు ఏమై పోతుందోనని అతిగారాబంతో అన్నీ తానై పెంచి, తన ప్రేమ తనకు తెలియకుండానే తన కొడుకు వ్యక్తిత్వ వికాసానికి అడ్డుగోడగా మారిందనే వాస్తవాన్ని గ్రహించలేని ఒక తల్లి!

తాను సాధించలేని MBBS సీటు తన కొడుకు ద్వారా సాధించి, అటుపై అతడ్ని అమెరికాకు పంపి, తన స్నేహితుల వద్ద గొప్పలు చెప్పుకోవాలనే తాపత్రయంతో తన కొడుకు ఆటిట్యూడ్ కు భిన్నమైన BiPC కోర్సులో చేర్పించి, అటుపై మెడికల్ ఎంట్రన్స్ లో ఆ అబ్బాయి విజయం సాధించలేక పోయేటప్పటికీ ఆక్రోశంతో "నీ బతుకెందుకురా? ఉరేసుకొనో, రైలు కిందపడో చావు!" అని సంయమనాన్ని కోల్పోయిన మరోతండ్రి!

కొడుకు తనకిష్టమైన మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటే "అదేమైనా కూడుపెడుతుందారా శంకరశాస్త్రి! పాటలు నేర్చుకొని బస్టాండ్ ల్లో , రైల్లో అడుక్కు తింటావా ?" అని కొడుకును చిన్నబుచ్చిన తండ్రి!

కోటీశ్వరుడైన తండ్రి కొనిచ్చిన స్మార్ట్ ఫోనుకు బానిసై ముక్కుమొఖం తెలియని వారితో చాటింగ్ చేసి, వారిని నమ్మి, తన బాత్రూం వీడియోలను పంపి చివరకు బ్లాక్ మెయిలింగ్ కు గురై డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఒక యువతి !

ఒకటవ క్లాసులో ఉన్నప్పుడు "నాన్నా! మా ఫ్రెండ్ రాహుల్ నన్ను వాటర్ మెలన్ అంటూ వెక్కిరిస్తున్నాడు" అని చెబితే, "గట్టిగా వాడి డొక్కలో గుద్దు చచ్చి ఊరుకుంటాడు వెధవ." అనే నాన్న మాటలే స్ఫూర్తిగా చేసుకొని పెరిగి, టీనేజి లో మద్యానికి, డ్రగ్స్ కి, నీలి చిత్రాలకి, వైలెంట్ వీడియోస్ కి బానిసై, పబ్ లో ఈవ్ టీజింగ్ చేయబోయి ప్రతిఘటించిన మరో యువకుడిని క్షణికావేశంలో కాల్చి చంపి, జ్యునైల్ హోమ్ కు చేరుకున్న ఒక టీనేజ్ కుర్రాడు! తన వయసున్న ఆరేళ్ళ అమ్మాయి తనలా స్కూల్ కి వెళ్ళక పోవడం గ్రహించి, తన ఇంట్లో పనిమనిషిగా పని చేస్తున్న వాళ్ళ అమ్మను ప్రోత్సహించి, తన తల్లిదండ్రిని ఆ అమ్మాయిని కూడ తన స్కూల్లోనే చేర్పించి, ఫీజు కట్టాలని రిక్వెస్ట్ చేసి చిన్న వయసులోనే సహానుభూతిని ప్రదర్శించిన ఒక అమ్మాయి! "పనిపిల్లను తీసుకొని బర్త్ డే పార్టీ కి వచ్చావేంటి? ఆ పిల్ల ఎప్పుడూ మట్టిలో ఆడుకుంటుంది. ఆ పిల్లను ముట్టుకొంటే మా పిల్లలకు కూడా రోగాలు వస్తాయి." అని ఢాంబికాన్ని ప్రదర్శించిన పక్కింటి ఆంటీతో "మట్టిలో ఆడుకొంటే రోగాలు రావు ఆంటీ, ఆడుకోకుంటే రోగాలు వస్తాయి. మట్టిలో ఆడుకుంటే రోగనిరోధక శక్తి పెరిగుతుందని మా అమ్మ చెప్పింది. మా అమ్మ డాక్టర్ కదా ! సోఫా పై కూర్చుని సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతూ, పిజ్జాలు, బర్గర్లు తింటూ కోక్ తాగితే రోగాలు తలుపు తోసుకొని మరీ వస్తాయి." అంటూ చిన్న వయసులోనే పరిణతిని ప్రదర్శించిన చిన్నారి!

దాదాపు 25 పాత్రలు, భిన్న మనస్తత్వాలు, భిన్న పోకడలు - ఇదీ బాలమిత్రుల కథ సంక్షిప్త రూపం. ఒక వ్యక్తి పర్సనాలిటీకి, అతని /ఆమె భవిష్యతుకు బాల్య దశలోనే పునాధి పడుతుంది. తల్లిదండ్రులు , గురువులు, స్నేహితులు, చూసేవి (టివి కార్యక్రమాలు, స్మార్ట్ ఫోన్ పై వీడియో గేములు మొదలైనవి) , వినేవి, చదివే పుస్తకాలూ ఇవి వ్యక్తి పర్సనాలిటీని తీర్చిదిద్దే ప్రధానాంశాలు.

స్కూలన్నప్పుడు Annual Day ప్రోగ్రాం ఉంటుంది . అక్కడ ఒకరో, ఇద్దరో చీఫ్ గెస్టులు! ప్రసంగాలు!! But this one is not of that genre.

దాదాపు పదిహేనేళ్లు ఎంతోమందిని IAS, IPS, గ్రూప్ 1,2 ఆఫీసర్లుగా తీర్చిదిద్ది అటుపై గత ఇరవైయేళ్ళుగ స్లేట్ ద స్కూల్ నడుపుతున్న నేను పిల్లల వ్యక్తిత్వ వికాసం - తల్లిదండ్రులు, స్కూల్ , స్నేహితులు అనే అంశాన్ని ఒక సీరియస్ వ్యాసంగానో, సెమినార్ ప్రసంగంగానో అందిస్తే కలిగే ప్రయోజనం కన్నా దాన్నే నాలుగు గంటలపాటు ఒక సినిమాలాగా పాత్రలు, సన్నివేశాలు , పాటలు, నృత్యాల రూపంలో అందిస్తే ప్రతి తల్లిదండ్రికి అర్థంమవుతుందని ఆ విధంగా "Educating a child essentially Involves Educating a parent" అనే లక్ష్యం నెరవేరుతుందని ఈ కార్యక్రమాన్ని అనేక రోజుల మేథోమధనంతో రూపొందించాను.

ఇదే నా హృదయపూర్వక వ్యక్తిగత ఆహ్వానం.

30 డిసెంబర్ (సోమవారం) శ్రీ సీతారామ గార్డెన్స్, ఈడుపుగల్లు, సాయంకాలం 5:15 నిమిషాల కల్లా రండి. కార్యక్రమం 5:26 కు ప్రారంభం అవుతుంది. ఆలస్యంగా వస్తే ప్రయోజనం ఉండదని గమినించగలరు. నాలుగు గంటల సమయం ఇవ్వండి. అనేక గంటలు సెమినార్ లో పేరెంటింగ్ పైన మేథావులు ఇచ్చే సూచనలకన్నా సమర్థవంతంగా పేరెంట్స్ కి మెసేజ్ ఎలా అందుతుందో చూడండి. కార్యక్రమం నిరుత్సాహపరిచినా, ఈపోస్టు లో నేను ఇచ్చిన హైప్, అంత సీన్ అక్కడ లేదని అనిపిస్తే మొహమాటం లేకుండా నామొఖం పైనే ఆమాట అనేయండి. మళ్ళీ ఇలాంటి ఆహ్వానాలు పెట్టే సాహసం చేయను. ఓపిగ్గా చివరిదాక చదివినందుకు ధన్యవాదాలు.

ఇట్లు
వాసిరెడ్డి అమర్ నాథ్
విద్యావేత్త